Andhra Pradesh: ఏపీలో ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు దారి మళ్లించడంపై సుప్రీంకోర్టు సీరియస్..

Andhra Pradesh: రాష్ట్ర విపత్తు సహాయ నిధులను దారి మళ్లించడంపై సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వానికి తలంటింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. దీనికి రెండు వారాల గడువు విధించింది. సుప్రీం ఆగ్రహంతో దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం.. నిధులు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని తమ న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపింది. కాగా పరిహారం అందలేదని కోవిడ్ బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వస్తే.. నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని కమిటీని ధర్మాసనం ఆదేశించింది.
కొవిడ్ నిధుల మళ్లింపుపై గతంలోనే సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు వెనక్కి ఇవ్వడంపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటామని న్యాయవాది అనగా.. అవసరం లేదని, దీనిపై తామే ఉత్తర్వులు ఇస్తామని ఇటీవలి విచారణలో ధర్మాసనం తెలిపింది. అందకనుగుణంగానే సుప్రీం ధర్మాసనం తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కోవిడ్ విపత్తు నిధులనూ దారి మళ్లించడం జగన్ పాలనకు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. సుప్రీం తీర్పు జగన్ ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిదని ట్వీట్ చేశారు.
తప్పులు చేయడమే కాకుండా జగన్ ప్రభుత్వం.. వాటిని సమర్థించుకోవాలనుకుంటోందని మండిపడ్డారు. కోవిడ్, వరదలు వంటి విపత్తులు వచ్చినపుడు అదనపు కేటాయింపులతో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఇలా నిధులను మళ్లించి పబ్బం గడుపుకోవడం ఏంటని దుయ్యబట్టారు. కోవిడ్‌తో చిన్నాభిన్నమైన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలని, జగన్ ప్రభుత్వం సాకులు చెప్పకుండా పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com