SWARNA WARD: ‘వార్డు సచివాలయం’ కాదు ‘స్వర్ణ వార్డు’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ పరిపాలన వ్యవస్థలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీలు, పట్టణాలు, నగరాల్లో ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్న వార్డు సచివాలయాల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘వార్డు సచివాలయం’ అనే పేరును తొలగించి, వాటిని ‘స్వర్ణ వార్డు’గా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదనకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించాలనే లక్ష్యంతోనే ఈ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆలోచనతో గతంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల వ్యవస్థను ఇప్పుడు మరింత బలోపేతం చేయాలన్నదే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు చెబుతున్నారు. ‘స్వర్ణ వార్డు’ అనే పేరు ద్వారా సేవల్లో నాణ్యత, విశ్వసనీయత, సమర్థత ప్రతిబింబించాలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా తెలుస్తోంది.
గెజిట్ విడుదల
స్వర్ణ వార్డులగా పేరు మార్పుతో సచివాలయాల పనితీరును మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. 'స్వర్ణ' పేరుకు తగ్గట్టుగా కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ సేవల విస్తరణ మరియు సిబ్బంది పనితీరులో వృత్తిపరమైన మార్పులను ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం లేదా ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు, వారికి గౌరవప్రదమైన వాతావరణంలో సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, అధికారిక లెటర్ హెడ్లు, ముద్రలను తక్షణమే ఈ కొత్త పేర్లకు అనుగుణంగా మార్చాలని సంబంధిత మున్సిపల్ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారికంగా గెజిట్ను కూడా విడుదల చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ తాజా మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల బోర్డులు, అధికారిక రికార్డుల్లో ‘స్వర్ణ వార్డు’ అనే పేరు అమల్లోకి రానుంది. పాలనలో సంస్కరణలు తీసుకువస్తూ, ప్రజలకు చేరువయ్యే క్రమంలో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.
పాలనా సంస్కరణల్లో దూకుడు
మార్పుతో పాటు ప్రభుత్వ రికార్డులు, అధికారిక పత్రాలు, బోర్డులు, నోటిఫికేషన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలన్నింటిలోనూ ‘వార్డు సచివాలయం’ అనే పదానికి బదులుగా ‘స్వర్ణ వార్డు’ అనే పేరు వినియోగంలోకి రానుంది. ఇప్పటికే ఉన్న సచివాలయ భవనాల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులను కూడా దశలవారీగా మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వార్డు సచివాలయాల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఒక వినూత్న ప్రయోగంగా ప్రారంభమైంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సేవలు వారి గడప వద్దకే చేరాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను అమలు చేశారు. జనన–మరణ ధ్రువీకరణ పత్రాలు, పింఛన్లు, రేషన్, విద్యుత్, నీటి సరఫరా, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అనేక సేవలు ఈ సచివాలయాల ద్వారా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు వాటికి ‘స్వర్ణ వార్డు’ అనే పేరు పెట్టడం ద్వారా సేవల ప్రమాణాలను మరింత పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
నాణ్యత, పారదర్శకతే లక్ష్యం
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ పేరు మార్పు కేవలం నామమాత్రపు మార్పు మాత్రమే కాదు. ‘స్వర్ణ వార్డు’ల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో మరింత నాణ్యత, బాధ్యత, సమయపాలన తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి వార్డును ఒక స్వర్ణ ప్రమాణంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ కొత్త పేరు ఎంపిక చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. పాలనలో సంస్కరణలు తీసుకువస్తూ, ప్రజలకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో స్థానిక పాలనను బలోపేతం చేయడం, వార్డు స్థాయిలో సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం ఈ నిర్ణయంతో సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. కేవలం పేరు మార్చడం కాకుండా, సచివాలయాల పనితీరులో మరింత సమర్థత తీసుకురావాలని వారు అభిప్రాయపడుతున్నారు. పేరు మార్పుతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

