FIRE: "పుంగనూరు ఘటన"పై భగ్గుమంటున్న ప్రజలు

FIRE: పుంగనూరు ఘటనపై భగ్గుమంటున్న ప్రజలు
జగన్‌ పాలనలో అరాచకం పెరిగిందని మండిపాటు... పుంగనూరును పెద్దిరెడ్డికి రాసిచ్చారా అని ప్రశ్న

పుంగనూరులో ఉత్తరాంధ్ర వాసులకు జరిగిన అవమానంపై ఆ ప్రాంత నాయకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అరాచక చర్యలతో మంత్రి పెద్దిరెడ్డి అండ్ కో రెచ్చిపోతున్నా ముఖ్యమంత్రి జగన్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆటవిక ఘటనపై ఉత్తరాంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిని మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో బట్టలూడదీసి అవమానించడం దారుణమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర చేస్తుంటే అడ్డుకోడానికి పుంగనూరులో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారా అని రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఇళ్లు దాటాలంటే పాస్‌పోర్ట్, వీసాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఈ అరాచకానికి వెనుకున్న పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ దురాగతంపై ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని రామ్మోహన్ నిలదీశారు.


పుంగనూరు ఘటన ఉత్తరాంధ్ర వాసుల అత్మగౌరవానికి సంబంధించినదని, ప్రశాంతంగా సైకిల్ యాత్ర చేసుకుంటున్న వారిపై మంత్రి అనుచరులు దాష్టీకానికి పాల్పడటం దారుణమని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖకు వస్తున్నానని అంటున్న సీఎం జగన్ ఉత్తరాంధ్ర వాసులపై జరిగిన దాడిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.


పుంగనూరులో ఉత్తరాంధ్రులను వైసీపీ నాయకులు అవమానించడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం నేతలు విశాఖలో నిరసనకు దిగారు. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యాన G.V.M.C గాంధీ విగ్రహం దగ్గర కళాకారులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతమన్నా, ప్రజలన్నా వైసీపీ నాయకులకు ఇంత చులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పాల్గొన్నారు. పుంగనూరు దురాగతం అత్యంత దారుణమని బీజేపీ నేత విష్ణుకుమార్ ధ్వజమెత్తారు. విశాఖలో రాజధాని ఏర్పాటుచేసి ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామంటున్న జగన్ మోహన్ రెడ్డి... పుంగనూరు ఘటనపై ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు.

పుంగనూరు ఘటన ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిందని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరును సీఎం జగన్‌ రాసిచ్చారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ విశాఖ వస్తాననేది కేవలం ఉత్తరాంధ్ర వాసులను అణగదొక్కేందుకేనా అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story