CBN: ఇక రాజకీయ పరిపాలన

సేవ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండబోదన్న ఆయన రాజకీయ పరిపాలన మాత్రమే చేస్తానని చెప్పారు. కష్టపడి పనిచేసిన సామాన్య కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తులో భాగంగా... నేడు NDAపక్షాల సమావేశంలో పాల్గోనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఎంపీలు పాల్గొనగా...మిగతా వారు జూమ్ ద్వారా హాజరయ్యారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో అనుసరించాల్సిన కార్యాచరణ సహా ఐదేళ్లు పనిచేయాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలను గౌరవించేలా పనిచేయాలని సూచించిన చంద్రబాబు 5 ఏళ్ల పాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని పార్టీని కార్యకర్తలే నిలబెట్టారని అన్నారు.
ఎంపీలుగా మంచి పనితీరు కనబర్చి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారన్న ఆయన బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని ఇకపై అలా ఉండదని తేల్చిచెప్పారు. ఎంపీలంతా తరచూ వచ్చి కలవాలన్న చంద్రబాబు తాను బిజీగా ఉన్నా మీతో మాట్లాడుతానని హామీఇచ్చారు. తన కోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారని, అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదని గుర్తుచేసుకున్నారు. ఇకపై ప్రతి అంశాన్నీ స్వయంగా పరిశీలిస్తానన్న చంద్రబాబు రాజకీయ పరిపాలన ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టపడి విధేయతతో పనిచేస్తే పదవులు వస్తాయన్న ఆయన దానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడే నిదర్శనమని చెప్పారు. అప్పల నాయుడుకి టికెట్ ఇస్తే చాలామంది వ్యాఖ్యలు చేశారని,ఆయన మాత్రం అందరినీ కలుపుకునిపోయి గెలిచారని కితాబిచ్చారు.
ఈ నెల 12న సీఎంగా ప్రమాణం చేస్తానని, దిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని ఎంపీలకు సూచించారు. ఏపీకి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాలని సమావేశం తర్వాత చెప్పిన ఎంపీలు విశాఖ స్టీల్ సహా అనేక అంశాలు పరిష్కారం కావాలని వివరించారు. NDA కూటమితోనే కొనసాగుతామని..ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని తేలిచెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణస్వీకారం చేయనుండగా ఈ నెల 11న TTLP సమావేశం జరగనుంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు నివేదిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ సహా పలు పార్టీల నేతలను.. ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రధాని ప్రమాణస్వీకారంతో పాటు ఒడిశా కూడా చంద్రబాబు వెళ్తారని బుచ్చయ్య వివరించారు. అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుందని నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై తెలుగుదేశం శ్రేణులు దాడులు చేస్తున్నాయని జగన్ ఆరోపించడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఓటమి చూసినా జగన్ ఇంకా మారలేదన్నారు. ఓటమి పాలయ్యామనే అసహనంతో తెలుగుదేశం శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. తిరిగి తామే దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com