విద్యార్థిని హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం- చంద్రబాబు

గుంటూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పట్టపగలు నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా విద్యార్థిని రమ్యను హత్య చేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకపాలనలో పట్ట పగలు ఆడపిల్ల సొంత ఇంట్లో ఉండాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోనే ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృతమైపోయాయన్నారు. జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు చంద్రబాబు. దిశ చట్టం ప్రచారంపై పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణపై చూపడం లేదన్నారు. నిందితుణ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అటు ఈ ఘటనపై విపక్షాలు కూడా స్పందించాయి. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. దిశ చట్టం తీసుకొచ్చామని సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలోనే దాడి జరిగిందని టీడీపీ నేతలున్నారు. రమ్యను హత్య చేసిన మృగాడిని కఠినంగా శిక్షించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.. హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని ఆయన ఫోన్‌లో పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com