CBN: అక్రమాలకు అడ్డా ఏపీపీఎస్సీ

APPSC గ్రూప్ -1 మూల్యాంకనం అక్రమాల్లో అసలు దోషులకు శిక్ష పడాలంటే గవర్నర్ జోక్యం సహా పూర్తిస్థాయిలో విచారణ జరగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పుచేసిన వాళ్లు ఉరేసుకోవాలని ఆయన ధ్వజమెత్తారు. మూల్యాంకనంలో అక్రమాలపై ఆధారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బహిర్గతం చేసిన చంద్రబాబు అయినప్పటికీ వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులకు...... APPSCని పునరావాస కేంద్రంగా మార్చి, జగన్ పార్టీ పర్సనల్ సర్వీస్ కమిషన్ లా మార్చేసిందని దుయ్యబట్టారు. అక్రమాలు జరిగాయని తేలినా అప్పీల్ చేస్తామని జగన్ అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు ఇంకెంత మంది జీవితాలను నాశనం చేస్తారని దుయ్యబట్టారు. జగన్ సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. APPSC ఛైర్మన్ సహా అందర్నీ తప్పించాలని డిమాండ్ చేశారు. మూల్యాంకన ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని గౌతం సవాంగ్ ., సీతారామాంజనేయులు చూశారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల ఎంపిక కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగా ఛైర్మన్ స్థాయిలో ఉన్న సవాంగ్ వ్యవహరించారని విమర్శించారు. 2022 మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు 2సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ కూడా ఇచ్చారని దుయ్యబట్టారు.
2018లో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవినీతి రాజ్యమేలింది. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ అయ్యాక దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్‌ను దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేశారు. రెండో మూల్యాంకనం జరగలేదని కోర్టుకు చెప్పారు. జరిగిందనడానికి ఆధారాలు ఇస్తున్నాం. మాన్యువల్ వాల్యుయేషన్‌కు వచ్చిన వారి కోసం రూ.20 లక్షలు ఖర్చు పెట్టారు. ఆవాస రిసార్ట్‌కు ఈ మొత్తం చెల్లించినట్లు బిల్లులు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారు. క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పులేదు. నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాలకంటే ఘోరంగా వ్యవహరించారు.
నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపింది. ఫిబ్రవరి 2022లో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేస్తామనలేదా? ఈమేరకు సొంత పత్రిక సాక్షిలో కూడా కథనాలు రాసింది నిజం కాదా? ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి. మూల్యాంకనం ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు తగ్గట్టుగా ఛైర్మన్ స్థాయిలో గౌతమ్ సవాంగ్ సహకరించారు. ఇన్ని అక్రమాలకు తావిచ్చిన ఆయన ఐపీఎస్‌కు అనర్హుడు.’’ అని చంద్రబాబు విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com