CBN: ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది

CBN: ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది
అరాచక శక్తులను ఉపేక్షించొద్దన్న చంద్రబాబు... వైసీపీని తుడిచి పెట్టేయాలన్న పవన్‌

అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ వైసీపీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు చెప్పారు. అరాచక శక్తులను ఉపేక్షించకూడదన్న ఆయన ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబ పరిస్థితి ఇతరులకు రాకూడదంటే కూటమికి ఓటేయాలన్నారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుండాలంటే మిథున్‌రెడ్డి ఓడిపోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామని, రాజంపేటను జిల్లా కేంద్రం చేసి వైద్య కళాశాలను మంజూరు చేయిస్తామన్నారు.


‘‘రాజంపేట జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడి వారికి అన్యాయం చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేసి అభివృద్ధి చేస్తాం. రాజంపేట, రాయచోటి, మదనపల్లె.. దేనికీ అన్యాయం చేయం. ఎక్కడైనా ప్రజాభిప్రాయం మేరకే పాలన జరగాలి. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్‌కుమార్‌రెడ్డిది. మేం వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి.. బాధితులను ఆదుకుంటాం. పేదలకు రెండు..మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తాం. గాలేరు-నగరి కాలువ పూర్తి చేసి.. కృష్ణా జలాలు తీసుకొస్తాం. ఏప్రిల్‌ నుంచే పింఛను రూ.4వేలు ఇంటి వద్దే ఇస్తాం. 3 నెలల బకాయిలు జులైలో ఇస్తాం. తెదేపా మద్దతుదారుల పింఛన్లు తీసేశారు.. మేం వచ్చాక ఇస్తాం. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కోస్తా ప్రాంతంలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదన్న పవన్‌ రాయలసీమలోనూ వైసీపీని తుడిచిపెట్టేయాలని.. పిలుపునిచ్చారు. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదని అడిగిన పవన్‌..పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా అని ప్రశ్నించారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం అంతం కావాలంటే.. కూటమి ప్రభుత్వం రావాలని పవన్‌ సూచించారు. ‘‘రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది.. ఇది మారాలి. ఓడిపోతామని తెలిసి జగన్‌.. 70 నియోజవకర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు. అందులో రాజంపేట మొదటిది. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తారట. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు?పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా?ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారు. సంపదంతా పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, కుమారుడు మిథున్‌రెడ్డి వద్దే ఉండిపోయింది. అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారు. డ్యామ్‌లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారు. డ్యామ్‌లు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి పట్టించుకోరు. ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి ముఠా నేతలు రూ.10వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు. ’’ అని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story