AP: చంద్రబాబు-పవన్‌ కీలక చర్చలు

AP: చంద్రబాబు-పవన్‌ కీలక చర్చలు
సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు... సంక్రాంతి వరకు స్పష్టత...

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి ఈ అంశాలపై ఓ నిర్ణయానికి రావాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల చర్చలు కీలకదశకు చేరాయి. గతరాత్రి హైదరాబాద్‌లో తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. మరో రెండు సమావేశాల తర్వాత....సంక్రాంతి వరకు ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం.


హైదరాబాద్‌ మాదాపూర్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఆదివారంరాత్రి వెళ్లిన చంద్రబాబుకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌తోపాటు ఆయన భార్య స్వాగతం పలికారు. ఇద్దరు నేతలూ సుమారు రెండున్నర గంటలపాటు చర్చించారు. ఈ చర్చల్లో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లల్లో పోటీ చేయాలి...? ఎక్కడ నుంచి ఎవరు బరిలో దిగాలనే విషయాలపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలు...వాటిని ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాలనే విషయమై....చంద్రబాబు, పవన్‌ చర్చించినట్లు సమాచారం. ఉమ్మడిగా బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, వాటికి ఎవరెవరు హాజరు కావాలి? ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ విషయాలపై ఓ అభిప్రాయానికి వచ్చాక....అధికారికంగా వెల్లడించాలని ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది

తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి. ఓట్ల అక్రమాలతోసహా వివిధ అంశాలపై అధికార పార్టీని ఎండగడుతున్నాయి. వైకాపా అసత్య ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయమై ఇరుపార్టీలు..త్వరలో శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నాయి. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా....తెలుగుదేశం, జనసేన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ తెలిపారు 2014 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు పవన్‌ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. పదేళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు....పవన్‌ నివాసానికి వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story