Chandrababu: అవకాశం ఇవ్వడమే మన తప్పు

Chandrababu: అవకాశం ఇవ్వడమే మన  తప్పు
జగన్ పై మండిపడుతున్న టిడిపి అధినేత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ పడుతున్న ఇబ్బందులకు ఒక్క ఛాన్స్ పాపమే కారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌ తన అహంకారంతో రైతులు కోలుకోలేనివిధంగా వారి జీవితాలపై దెబ్బకొట్టారని మండిపడ్డారు. మిగ్జామ్ తుపాను నష్టంపై..కేంద్రానికి సరైన నివేదికలు పంపటంలోనూ...నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కరవు నివేదికలు కేంద్రానికి పంపకుండా, తుపాను నష్టం నివేదికలో... 26లక్షల ఎకరాల్లో పంట వేయలేదని పేర్కొన్నారని మండిపడ్డారు. భారీ నష్టం జరిగితే 700 కోట్లేనని నివేదిస్తారా అని..ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల కోసం పోరాడుతుంటే అణచివేస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రజల్లో మార్పు మొదలైందన్న ఆయన ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చాక అంతా బయటకొస్తారని పేర్కొన్నారు. లెక్కలు తారుమారు కావడం వల్లే జగన్11 మందికి సీట్లు మార్చేశారని చంద్రబాబు విమర్శించారు. దళితులు, బీసీలనే బదిలీ చేసిన జగన్‌....బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి సహా తన బినామీలను ఎందుకు మార్చలేదని నిలదీశారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే, పులివెందులలో బీసీ అభ్యర్థిని నిలపాలని సవాలు చేశారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అభ్యర్ధులను నిలబెడతామన్న చంద్రబాబు పొత్తులో ఉన్నందున సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు.

మరోవైపు కుప్పం నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కుప్పంలో అరాచక పరిస్థితులు చూస్తున్నామన్నారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తనను ఇబ్బంది పెట్టేందుకు, తెలుగు దేశం పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని.. అరెస్టులు చేసి జైలుకు పంపారన్నారు. కుప్పం నియోజవకర్గం నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన కార్యక్రమాలకు దిగినవారిపైనా తప్పుడు కేసులు పెట్టారని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు.

Tags

Next Story