ప్రజల ఆస్తులను కొట్టేయడానికి జగన్ ప్రణాళికలు: చంద్రబాబు

ప్రజల ఆస్తులను కొట్టేయడానికి సీఎం జగన్ ప్రణాళికలు వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాటెడ్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, సొసైటి ల్యాండ్స్ 6రకాల భూములపై జగన్ కన్నుపడిందని, అందుకే ఇప్పుడీ భూసర్వే అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి భూ సర్వేతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఆస్తులను, భూములను ఏ రోజుకారోజు చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ అండతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోందని, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల భూకుంభకోణాలు జరుగుతున్నాయి.
20 నెలల ఉన్మాది పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర వేధింపులకు గురయ్యారన్నారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టాలో అంతమందినీ జగన్ ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు చంద్రబాబు. వైసీపీ అజెండా మొత్తం ప్రజల్ని వేధించడమేనని, దాడులు దౌర్జన్యాలతో బెంబేలెత్తించడమేనన్నారు. ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై దాడికి తెగబడ్డారన్నారు. ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా, ప్రజల్ని మభ్యబెట్టడమే వైసీపీ ధ్యేయమన్నారు. గంటకో అత్యాచారం, పూటకో హత్యగా నేరగాళ్ల అకృత్యాలు పెచ్చుమీరాయన్నారు చంద్రబాబు. అయినా వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదన్నారు. వైసీపీ దుర్మార్గాలపై టీడీపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని, వైసీపి బాధిత ప్రజలకు అండగా ఉంటుందన్నారు చంద్రబాబు.
ఉచితంగా అందే ఇసుకకు ధర పెట్టి వైసీపీ ప్రభుత్వం నిలువుదోపిడి చేస్తోందంటూ మండిపడ్డారు. టీడీపి హయాంలో 15 వందల రూపాయలకే దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 8వేల రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోందన్నారు. శాండ్- ల్యాండ్, వైన్ –మైన్ మాఫియా దోపిడీకి హద్దుపద్దు లేకుండా పోయిందన్నారు. గాలి, నీరు, భూమి, దేనినీ వదలకుండా పంచ భూతాలనూ మింగేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. సొంత పార్టీ కార్యకర్తలనూ సైతం వైసీపీ నేతలు వదలడం లేదని, భట్టిప్రోలు వైసిపి కార్యకర్త ఆత్మహత్యా యత్నం, తాడేపల్లి వైసిపి కార్యకర్త సెల్పీ వీడియోలే దీనికి నిదర్శనమన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com