Chandrababu Kuppam Tour : ఇవాళ, రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన..!

Chandrababu (tv5news.in)
Chandrababu Kuppam Tour : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో మాట్లాడి వారిలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంటారు. తర్వాత లక్ష్మీపురం మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటలకు కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
అనంతరం మాజీ సర్పంచ్ గోపినాథ్ ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఐదున్నరకు వడ్డిపల్లి గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత మండల మాజీ అధ్యక్షురాలు కాంచనమ్మ ఇంటిని సందర్శిస్తారు. అక్కడి నుంచి 7 గంటలకు టీడీపీ కార్యాలయానికి చేరుకుని నేతలతో సమావేశమవుతారు. రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు.రేపు ఉదయం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరిస్తారు చంద్రబాబు. ఉదయం పది గంటలకు లక్ష్మీపురం, సిగలపల్లి, తుంబీగానిపల్లి, అనిమిగనిపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్ఎస్ పేట మసీదును సందర్శించిన అనంతరం కొత్తపేటలో పర్యటిస్తారు. అక్కడి నుంచి పరమ సముద్రం గ్రామానికి చేరుకుని రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత డీకే పల్లి, ఆర్బన్‌కాలనీ, ప్యాలెస్ రోడ్ మీదుగా కుప్పం పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం ఏడున్నర గంటలకు ఆర్ అండ్ బీ అతిథి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. తరువాత రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com