Visakhapatnam Steel Plant : స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు : చంద్రబాబు

Nara chandrababu Naidu (File Photo)
విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. లక్షలాదిమంది ఏళ్లతరబడి ఉద్యమించి, 32మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామన్నారు. ఇలాంటిదాన్ని జనాన్ని ఏమార్చి లక్షల కోట్లను కొట్టెద్దామనుకుంటున్న వైసీపీ గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుంటామని ట్వీట్ చేశారు.
అభివృద్ది వికేంద్రీకరణకే విశాఖలో పరిపాలనఅన్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటికే అక్కడి కొండలు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ఉక్కుపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 18వేల శాశ్వత ఉద్యోగులు, 22 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు.. పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కును ప్రైవేటు పరంచేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
గతంలో స్వర్గీయ వాజ్‌పాయ్ ప్రభుత్వం ఇదే పరిస్థితి వస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును ఆనాడు టీడీపీ ప్రభుత్వం కాపాడిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు కాపాడలేక పోతుందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీని ఢీకొంటా.. కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన సీఎం.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. క్విడ్ ప్రోకో బుద్దిని పక్కన పెట్టాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com