ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు: చంద్రబాబు

ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు: చంద్రబాబు
జాతీయ రైతు దినోత్సవం నేపథ్యంలో అన్నదాతలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదిమందికి అన్నం పెట్టే రైతులు ఎప్పుడూ బాగుండాలనేది టీడీపీ ఆకాంక్ష అన్నారు

జాతీయ రైతు దినోత్సవం నేపథ్యంలో అన్నదాతలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదిమందికి అన్నం పెట్టే రైతులు ఎప్పుడూ బాగుండాలనేది టీడీపీ ఆకాంక్ష అన్నారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతుండటం, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉండటం విషాదకరమన్నారు చంద్రబాబు.

ప్రజారాజధాని అమరావతి కోసం రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. వీరిలో 110 మందికిపైగా అన్నదాతలు అమరులయ్యారన్నారు. మరోవైపు ప్రభుత్వం తన అప్పు పరిధిని పెంచుకోవడం కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం వేయబోతోందని చంద్రబాబు మండిపడ్డారు.

వరుస వరదలు, భారీ వర్షాలు, నివర్‌ తుపాను విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, టీడీపీ సభ్యులు అసెంబ్లీలో బైఠాయించి పట్టుబట్టే వరకు పంట బీమా ప్రీమియం కట్టలేదంటే రైతుల పట్ల పాలకులకెంత నిర్లక్ష్యమో అర్థమవుతోందన్నారు చంద్రబాబు. పైగా రైతుకు పరిహారం అడిగితే సభలో ఎదురుదాడిగి తెగబడ్డారని వైసీపీపై మండిపడ్డారు. ఇకనైనా పాలకులు తీరు మార్చుకుని పంటకు గిట్టుబాటు ధరలు అందించాలని, పంట కొనుగోళ్లలో అవినీతికి స్వస్తి చెప్పాలని, రైతుల బకాయిలను తక్షణమే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లుగా సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందించాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. సబ్సిడీ ఇచ్చి సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలన్నారు. ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదంటారని పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story