CBN: వైసీపీని నేలకూల్చండి

రాయలసీమలో వైసీపీని నేలకూల్చాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిని శిక్షిస్తామని, దోపిడీ సొమ్మును కక్కిస్తామని తేల్చిచెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనాని పవన్‌కల్యాణ్, మాజీ సీఎం, రాజంపేట కూటమి అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోజుకో సానుభూతి డ్రామాతో ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని, ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. గాలేరు- నగరి కాలువను పూర్తి చేసి..., కృష్జా జలాలను తీసుకొస్తామన్నారు. రాయలసీమను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటుందన్న చంద్రబాబు కూటమి వచ్చాక అక్రమార్కులకు సంకెళ్లేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమితో జత కట్టామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రగతి కావాలంటే దోపిడీదారులను సాగనంపాలన్న ఆయన పెద్దిరెడ్డి కుటుంబానికి ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రైల్వేకోడూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు స్పష్టం చేశారు.చంద్రబాబు, పవన్, మోదీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికలయ్యాక జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగ కల్పనకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయన్న నేతలు జగన్ పాలనలో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకుంటామని హామీఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com