TDP: భువనేశ్వరి "నిజం గెలవాలి" సభలు

TDP: భువనేశ్వరి నిజం గెలవాలి సభలు
నిజం గెలవాలి పేరుతో జోన్ల వారీగా సభలు... పాల్గొననున్న భువనేశ్వరి

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుతో ఆవేదన చెంది గుండె పగిలి ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆయన భార్య నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి ’ పేరుతో జోన్లవారీగా నిర్వహించే సభల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్టుతో నిలిచిన ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాన్ని లోకేశ్‌ కొనసాగించనున్నారు. చంద్రబాబు జైలు నుంచి రాగానే లోకేశ్‌ ‘యువగళం’ యాత్రను తిరిగి చేపట్టనున్నారు. ఈ నెల 21న సీనియర్‌ నేతలతో నిర్వహించే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎప్పటి నుంచి ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభించాలనేది నిర్ణయించనున్నారు. రాజమండ్రి జైల్లో బుధవారం సాయంత్రం చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్‌ అవ్వగా భవిష్యత్తు కార్యాచరణపై వారికి ఆయన దిశానిర్దేశం చేశారు.


చంద్రబాబుతో భేటీ తర్వాత టీడీపీ ముఖ్య నాయకులతో లోకేశ్‌ సమావేశం అయ్యారు. జైలులో ఉన్న చంద్రబాబు కాస్త నీరసంగా ఉన్నారని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఇక వేగవంతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. అలాగే ఈ నెలాఖరు వరకు ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగించనున్నారు. టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్‌ అరాచకాలు, ప్రభుత్వ కుట్రను కరపత్రాలతో వివరించనున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత.. ఆవేదనకు గురై 105 మంది పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు మృతి చెందారని, వారి కుటుంబాల్ని పరామర్శించి ధైర్యం చెబుతామని గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ దీక్షలో భువనేశ్వరి ప్రకటించారు. ఇందులో భాగంగానే ‘నిజం గెలవాలి’ కార్యక్రమం చేపట్టనున్నారు. జోన్‌కు ఒకటి చొప్పున అయిదు జోన్లలో సభలు నిర్వహిస్తామని, వాటిలో భువనేశ్వరి పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి.

చంద్రబాబు అరెస్టుతో ఆయన అప్పటి వరకు నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం నిలిచిపోయింది. న్యాయవాదులతో సమీక్షించాల్సి ఉండటంతో లోకేశ్‌ కూడా ‘యువగళం యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలనే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. భవిష్యత్తుకు హామీ’ కార్యక్రమాన్ని లోకేశ్‌ కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక.. లోకేశ్‌ మళ్లీ యువగళం యాత్ర చేపడతారని పార్టీ వర్గాలు వివరించాయి. ప్రస్తుత సమయంలో ‘యువగళం’ ప్రారంభించినా దానిపై పూర్తి సమయం వెచ్చించడం కష్టమని పార్టీ వర్గాలు అంటున్నాయి.


Tags

Next Story