ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. !

Nara chandrababu Naidu (File Photo)
ఏపీ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు తదనంతర పరిణామాల్లో టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ లేఖలో తెలిపారు. బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైసీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా.. టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఇంటిముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైసీపీ నేతలు అతనితో పాటు కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారంటూ లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదయ్యేలా చూశారన్నారు. ఈ కేసు ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు, వైసీపీ నేతలు బాధితుల్ని బెదిరిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చూస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com