విపత్తుల్లో వైసీపీ సర్కారు చేతులెత్తేసింది : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌తోపాటు మంత్రులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. వరద బాధితులను సీఎం జగన్, మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. హుద్ హుద్, తిత్లీ బాధితులను టీడీపీ ప్రభుత్వం ఎలా ఆదుకుందో... ఇప్పుడు వరదలు, భారీ వర్షాల బాధితులపై వైసీపీ నిర్లక్ష్యం ఎలా ఉందో ప్రజలే చూస్తున్నారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి గాల్లో ప్రదక్షిణ చేసి చేతులు దులుపుకుంటుంటే... మంత్రులు ఎక్కడికెళ్లినా వరద బాధితులు చుట్టుముట్టి నిలదీస్తున్నారని ఆయన అన్నారు.
విపత్తుల్లో వైసీపీ సర్కారు చేతులెత్తేసిందని, 500 ఇచ్చి చేతులు దులుపుకుంటోందని ఆయన విమర్శించారు. కరోనా నియంత్రణలో విఫలం, వరద నీటి నిర్వహణలో విఫలం, సహాయక చర్యల్లో విఫలమైందన్నారు. ఇంత విఫల ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు చూడలేదన్నారు. విజయవాడలో ఆడబిడ్డలపై కిరాతక చర్యలను చంద్రబాబు ఖండించారు. దేవుళ్ల విగ్రహాలు, అంబేద్కర్ వంటి మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే వైసీపీ సర్కారు చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు...
టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే పోలవరం పూర్తయ్యేదని... మరో పది పదిహేను ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేవాళ్లమన్నారు. పోలవరం పనులు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. సీమ జిల్లాలకు, దుర్భిక్ష ప్రాంతాలకు నీరు ఇచ్చేవాళ్లం అన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో టీడీపీ నూతన కమిటీలకు ఎంపికైనవారిని అభినందించారు చంద్రబాబు. కొత్త బాధ్యతలను మరింత చురుగ్గా నిర్వర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని, వైసీపీ బాధిత ప్రజానీకానికి టీడీపీ కమిటీలు అండగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో టీడీపీ మరో 30 ఏళ్లు ప్రజాదరణ పొందాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com