CBN: దుష్టపాలన అంతానికి పంతం పట్టండి

CBN: దుష్టపాలన అంతానికి పంతం పట్టండి
విభేదాలు పక్కనపెట్టి ముందుకు సాగండి... తెలుగు శ్రేణులకు చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసమే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మూడు పార్టీల పొత్తు వైసీపీను ఓడించడానికి మాత్రమే కాదని.. రాష్ట్రాన్ని గెలిపించడం కూడా అని స్పష్టం చేశారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడినపెట్టాలంటే కేంద్రం సహకారం కావాలన్న చంద్రబాబు.. విభేదాలు పక్కనపెట్టి... ప్రతి ఒక్కరూ కలసి పనిచేయాలని తెలుగుదేశం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్‌ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేయడంతో పాటు... ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ రివర్స్‌ పాలనలో నష్టపోయిన ఏపీపై బాధ్యతతో.., దుష్టపాలనను అంతం చేయడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. పలు సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశాల గురించి వారితో చర్చించారు. ఇంటింటికీ సూపర్‌-6 పథకాల ప్రచారంలో మంచి పనితీరు కనబరిచిన కార్యకర్తల్ని అభినందించారు.


పోలవరం పూర్తికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సాయం అవసరమని వివరించారు. వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు కలసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు టికెట్‌ పొందిన అభ్యర్థుల పనితీరును చివరి నిమిషం వరకు సమీక్షిస్తానని... ప్రజల్లో లేకపోయినా, మంచిపేరు తెచ్చుకోకపోయినా... మార్చడానికి వెనుకాడబోనని... చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి అభ్యర్థీ ఒక న్యాయవాదిని నియమించుకుని ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొట్టాలని సూచించారు. పోలింగ్‌లో అక్రమాల్నే జగన్‌ నమ్ముకున్నారన్న చంద్రబాబు... క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి చట్టవ్యతిరేక చర్యనూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.


ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక వైసీపీ ఆగడాలు, తప్పుడు అధికారుల ఆటలు సాగవని అభిప్రాయపడ్డారు. చిలకలూరిపేటలో నిర్వహించనున్న సభకు బస్సులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు అంగీకరించిన అంశాన్ని ప్రస్తావించారు. మిగతా అధికారులూ ఆలోచించుకోవాలన్న చంద్రబాబు... చట్టబద్ధంగా పనిచేయాలని హితవుపలికారు. పోలింగ్‌ ముగిసే వరకు ఏ కార్యకర్త, నాయకుడు విశ్రమించొద్దని... తేల్చిచెప్పారు. కూటమి గెలుపు చారిత్రక అవసరమని అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటూ.. ప్రతి సీటూ ముఖ్యమేనని చంద్రబాబు తెలిపారు. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలని.. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే సభ ద్వారా కొత్త చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. కూటమి ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. వైకాపాను ఓడించి 160కిపైగా స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేశారు. ‘రా కదలి రా’, ‘శంఖారావం’ సూపర్‌హిట్‌ అవ్వటంతో... పాటు కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపాయన్నా చంద్రబాబు... భువనేశ్వరి చేస్తున్న ‘నిజం గెలవాలి’ద్వారా తన అరెస్టును తట్టుకోలేక మరణించిన 149 మంది కుటుంబాలకు సాయం అందిందని గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story