TDP: దళితులపై దాడులపై భగ్గుమన్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌లో దళితుల ఓట్లతో గద్దెనెక్కిన వైసీపీ నేతలు ఎస్సీలపై వరుస దాడులకు తెగబడుతుండే పట్టించుకోకపోవడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులను ఖండిస్తూ పలుచోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. వైసీపీ పాలనలో డాక్టర్ సుధాకర్ మొదలుకుని శ్యాం కుమార్ వరకు ఎంతో మంది దళితులపై దాడులు జరిగాయని నేతలు మండిపడ్డారు. ఓ పక్క దళితులపై దాడులు జరుగుతుంటే మరోపక్క అధికార పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో దళిత ఓట్లతోనే వైసీపీకి రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్ బహిరంగ వేదికలపై తన తన అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై లేని ప్రేమలు ఒలకబోస్తుంటే వాస్తవంలో ఆయా వర్గాలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా దారుణాలు కొనసాగుతున్నాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్షపార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి కేసులేని టీడీపీ దళితనేత, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దళితనేతను అక్రమంగా నిర్బంధించి దాడిచేసిన కల్లూరు సిఐపై రాష్ట్ర డిజిపి తక్షణమే విచారణ జరిపి ఎస్సీ,ఎ స్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారపక్షానికి ఒక చట్టం.. ప్రతిపక్షాలకు మరో చట్టమన్నట్టు ముఖ్యమంత్రి నియంత్రత్వంగా వ్యవహరిస్తుంటే.. పోలీసులు నిస్సిగ్గుగా ఆయనకు వత్తాసు పలుకుతున్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. దళిత మంత్రులు ఎమ్మెల్యేలు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవులు, స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు.
దళితులపై దాడులను నిరసిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. అధికార పార్టీ రౌడీమూకలు దళితులపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నాయని తెదేపా సీనియర్ నేత నెట్టెం రఘురామ్ విమర్శించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ పాలనలో ఎస్సీలపై దాడులు అధికమవుతున్నాయని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులు అంబేడ్కర్ విగ్రహా ఎదుట మోకాళ్లపై నిల్చుని నిరసన చేపట్టాయి. జగన్ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో దళితులు ఓటు రూపంలో బుద్ధి చెబుతారని కర్నూలులో దళిత నేతలు హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com