TDP: దళితులను దగా చేసిన జగన్‌

TDP: దళితులను దగా చేసిన జగన్‌
X
రాజమహేంద్రవరంలో దళిత శంఖారావం సభ.... దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన

సీఎం జగన్‌ ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని తెలుగుదేశం దళిత నాయకులు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో దళిత శంఖారావం సభ నిర్వహించారు. తెలుగుదేశం వివిధ పథకాలతో దళితుల్ని ముందడుగు వేయిస్తే... జగన్‌ వెనకడుగు వేయించారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం గాదాలమ్మ నగర్‌లో స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో దళిత శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జవహర్‌, మహాసేన రాజేష్‌ సహా ఇతర తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. దళితుల అండతో అధికారంలోకి వచ్చిన జగన్‌... వారిపైనే దాడులు చేయిస్తున్నారని... నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంబేడ్కర్‌ ఆశయాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మరోవైపు ఈ నెల 17 న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరుకానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్వయంగా సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కూటమి తొలి బహిరంగ సభ నిర్వహణపై మూడు పార్టీల నాయకులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో దాదాపు దశాబ్దం తర్వాత 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖచిత్రం మళ్లీ ఆవిష్కృతం కానుంది. చిలకలూరిపేటలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... ఒకే వేదికను పంచుకోనున్నారు.

ఏపీ ప్రగతి, అభివృద్ధి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయనే సందేశాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ప్రకటన తర్వాత మూడు పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ కావటంతో అందరూ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బొప్పూడి సమీపంలో ఏర్పాట్లు సైతం చకాచకా సాగుతున్నాయి. ఇప్పటికే బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి మూడు పార్టీల నేతలతో 13 కమిటీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో నారా లోకేశ్‌ సమక్షంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షకు 3 పార్టీల కమిటీ సభ్యులు హాజరయ్యారు. కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేయాలని లోకేష్ నేతలకు సూచించారు. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశం చేశారు.

Tags

Next Story