AP : పులివెందులలో ఎగిరిన పచ్చ జెండా.. సొంత ఇలాకాలో జగన్‌కు షాక్...

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజలు షాక్ ఇచ్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల లో టీడీపీ జెండా ఎగిరింది. తాజాగా జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల ను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ వేసిన ప్రణాళికలు విజయం సాధించాయి. గెలుపు కోసం పన్నిన వ్యూహ ప్రతి వ్యూహాలు చివరకు టీడీపీని రాజు ను చేశాయి. రాష్ట్రంలో తమకు ఎదురు లేదని ఈ విజయంతో మరోసారి నిరూపించింది టీడీపీ.
పులివెందుల జడ్పీటీసీ స్థానం కోసం జరిగిన ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి దాదాపు 6 వేల 52 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో టీడీపీకి 6735 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ స్థానంలో మొత్తం 10వేల601 ఓట్లు ఉండగా.. 7814 ఓట్లు పోల్ అయ్యాయి. సొంత ఇలాకాలో కనీసం డిపాజిట్ కూడా రాకపోవడం జగన్‌కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీ పీఠం టీడీపీ వశమైంది. 2016 కంటే ముందు ఐదుసార్లు వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2016 జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తర్వాత వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో పులివెందులలో 76.44 శాతం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com