AP: హోరెత్తుతున్న ప్రచారం

AP: హోరెత్తుతున్న ప్రచారం
జనసేన-టీజీపీ-బీజేపీ నేతల విస్తృత ప్రచారం.... భారీగా ప్రజా మద్దతు

తూర్పు గోదావరి జిల్లా రాజానగరలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామ కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ...కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అరచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. యువత ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


వైసీపీని నమ్మి ప్రజలు మోసపోయారని, ఐదేళ్లుగా ఆ పాలనలో నరకం అనుభవిస్తున్నారని భీమిలి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మరోసారి వైసీపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ర్టాభివృద్ధి కూటమితోనే సాధ్యమని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. 19వ వార్డుకి చెందిన300 కుటుంబాలు వైకాపా వీడి తెలుగుదేశంలో చేరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.


ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు అన్నివిధాల నష్టపోయారని... తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్ధి భాష్యం ప్రవీణ్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకృతి సంపదను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ తాగు, సాగు నీటి సమస్యపై పెట్టలేదని ఆరోపించారు. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన భాష్యం ప్రవీణ్ ... సమస్యలు లేని నియోజకవర్గంగా పెదకూరపాడును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకాలన్నింటినీ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సెంటిమెంట్ ఆటలు సాగవని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి నష్టపోయిన విషయాన్ని ప్రజలు గుర్తించారని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసే నాయకుడికి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని సుధాకర్ వెల్లడించారు.

కర్నూలులో తెలుగుదేశం జెండా ఎగురువేస్తామని....తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. జగన్ హయాంలో నగర అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కర్నూలును అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story