TDP-JANASENA: జనసేన-టీడీపీ ఉమ్మడి భేటీ

వైసీపీ ప్రభుత్వం బడుగులను అణగదొక్కుతోందని బీసీ సంఘం నాయకులు మండిపడ్డారు. కడపలో బీసీ సంఘాలకు నమ్మకద్రోహం పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో తెలుగుదేశం, జనసేన నేతలతో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల సబ్ ప్లాన్ నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని సమావేశంలో వక్తలు విమర్శించారు. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని ఆక్షేపించారు. నమ్మించి వంచించిన జగన్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సమావేశంలో తీర్మానించారు.
సమాజంలోని పేదలను ధనవంతులుగా మార్చడమే తెలుగుదేశం - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రధాన అజెండా అని సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. బీసీలకు ప్రభుత్వ నమ్మక ద్రోహంపై ఏలూరులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశంతోపాటు, జనసేన, బీజేపీ, బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీసీలకు రాజకీయంగా రావాల్సిన గుర్తింపు, గౌరవం రావడం లేదని... అగ్రవర్ణాల ఆధిపత్యంలో బీసీలు ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నారని కుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు ప్రభుత్వ ధనాన్ని పంపిణీ చేయాలన్నదే తెలుగుదేశం, జనసేన మూల సూత్రమన్న యనమల ఆ దిశగా మేనిఫెస్టోలో పలు కీలక అంశాలను పొందుపరచనున్నట్లు వెల్లడించారు.
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు పలు సూచనలు, సలహాలు చేసినట్లు పు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తెలిపారు. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో 75 వేల కోట్ల రూపాయల అంచనాతో... 47 సంక్షేమ పథకాలు ప్రతిపాదించామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల అనంతరం తెలుగుదేశం - జనసేన కూటమిలో భాజపా చేరే అవకాశం ఉందని జోగయ్య అన్నారు.
ఈ కమిటీ మొదటిసారి రాజమండ్రిలో సమావేశమైంది. ప్రభుత్వంపై ఆందోళనల కంటే రెండు పార్టీల కలయికపైనే ముందుగా దృష్టి పెట్టాయి. రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశానికి నారా లోకేష్‌తో పాటు పవన్ కళ్యాణ్ హాజరై క్యాడర్‌కు పలు సూచనలు చేశారు. ఇక ఆ తర్వాత జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు జరిగాయి. రెండు పార్టీల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగడంపైనే చర్చించాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు క్యాడర్ మధ్య కలయిక కోసం ఏర్పాటు చేసినవే. ముఖ్యంగా పొత్తు వల్ల రెండు పార్టీల నాయకుల్లో గానీ కార్యకర్తల్లో గానీ మనస్పర్ధలు లేకుండా ముందుకెళ్లేలా ఈ సమావేశాలు నిర్వహించారు. మరోవైపు ఓటు బదలాయింపుపైనా సమన్వయ సమావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇతర పార్టీలకు మళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖచ్చితంగా వేసేలా చూడాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. మొత్తంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగిన సమావేశాల్లో ఎలాంటి కార్యాచరణ లేకుండా కలిసికట్టుగా సాగడంపైనే చర్చించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com