AP: వాడిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదు

వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా పర్యటనలో తమపై దాడి చేసిన తురకా కిషోర్ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న .. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తురకా కిషోర్‌ను ఎన్‌కౌంటర్ చేసినా తప్పు లేదని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇలాంటి ఆకు రౌడీలు సమాజానికి హానికరమన్నారు. చైర్మన్ పదవి ఆశ చూపించి.. ఈ తురకా కిషోర్‌ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమపైకి వదిలారని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. ఆ నాడు తాము తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని తెలిపారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆదేశాలు వచ్చాయని తెలిపారు.
అప్పటినుంచి అజ్ఞాతమే
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. నాటి నుంచి తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో కిషోర్ హైదరాబాద్‌లో ఆశ్రయం పొందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా సమాచారంతో పోలీసులు హైదరాబాద్ చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు.
ఒకటా రెండా ఎన్ని అరాచకాలో...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ తురకా కిశోర్ అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. డిసెంబర్ 16 ,2022 న తెలుగుదేశం పార్టీ మాచర్లలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టింది. ఆ సమయంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ నేతలు దహనం చేసిన కేసులో ప్రధాన నిందితుడు కిశోర్. టిడిపి ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పై దాడి చేశారని ఆరోపణలున్నాయి. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో టిడిపి ఆస్తులను, టీడీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2024 మే నెలలో జరిగిన ఎన్నికలలో పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పలు హింసకాండలో కిశోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇలా చాలా కేసుల్లో కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com