నందం సుబ్బయ్య హత్య కేసులో నలుగురి అరెస్ట్

ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కుండా రవితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది బంగారురెడ్డిపై మృతుడి భార్య అపరాజిత ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, రాచమల్లు, బంగారు రెడ్డి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు పోలీసులు.
నందం సుబ్బయ్యది రాజకీయ హత్యేనంటూ ఆరోపిస్తోంది టీడీపీ. అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి.. నందం సుబ్బయ్యను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు నారా లోకేశ్. హత్య చేయించిన ఎమ్మెల్యే, అతని బావమరిది బంగారురెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తుంటే.. ఆ పాపం ఊరికే వదిలిపెట్టదంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన భర్తను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హత్య చేయించారని ఆరోపిస్తున్నారు నందం సుబ్బయ్య భార్య అపరాజిత. రాచమల్లు కుటుంబానికి ఎన్నో ఏళ్లు సేవ చేసినా.. కనికరం లేకుండా హత్య చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఆయన బావమరిది బంగారురెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com