నేడు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అంత్యక్రియలు!

నేడు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అంత్యక్రియలు!
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్ననే అంత్యక్రియలు జరగాల్సి ఉన్నప్పటికీ, పోలీసుల వైఖరిపై నిరసనలు కొనసాగాయి.

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్ననే అంత్యక్రియలు జరగాల్సి ఉన్నప్పటికీ, పోలీసుల వైఖరిపై నిరసనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో బుధవారం ప్రొద్దుటూరులో హైడ్రామా చోటుచేసుకుంది. హత్య ఘటనపై ఫిర్యాదు చేసిన మృతుడి భార్య అపరాజితకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని బుధవారం సాయంత్రం అందజేశారు. అందులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారుమునిరెడ్డి, ప్రొద్దుటూరు పురపాలిక కమిషనర్‌ రాధ పేర్లు లేకపోవడంతో ఆమె అభ్యంతరం వ్యక్తంచేశారు.

సుబ్బయ్య మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు విషయం చెప్పారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసేవరకు అంత్యక్రియలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలంటూ లోకేశ్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సుబ్బయ్య మృతదేహం పక్కనే కూర్చుని నిరసన చేపట్టారు.

టీడీపీ ఆందోళనతో పోలీసులు దిగివచ్చారు. సుబ్బయ్య భార్య అపరాజిత, టీడీపీ నేతలతో చర్చించారు. చివరికి పోలీసులు అపరాజిత నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినందున కోర్టును సంప్రదించి మిగిలిన వాళ్ల పేర్లు చేరుస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబసభ్యులు ధర్నా విరమించారు. అప్పటికే రాత్రి కావడంతో సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ఆందోళనలో పాల్గొన్న లోకేశ్‌ రాత్రి ప్రొద్దుటూరులోనే బస చేశారు.

వైసీపీ ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగితే మరో ఆరునెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించాల్సి ఉంటుందని లోకేశ్‌ విమర్శించారు. ఇప్పటికే తాడిపత్రి, ప్రొద్దుటూరు, తాడేపల్లి, పలాసలో 144 సెక్షన్‌ విధించారని అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అరాచకాలను బయటపెట్టినందుకే సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story