Nara Lokesh : వైసీపీ దుర్మార్గపు పాలనకు అంతం పలకాలన్న ఉటీడీపీ యువ నేత

వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖను గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని ధ్వజమెత్తారు. సామాన్యుడి చైతన్య రథంలా సైకిల్ సేవలు అందిస్తుంటే ఐదేళ్లుగా రైతులు, యువత ఆత్మహత్య చేసుకునేందుకు ఫ్యాన్ ఉపయోగపడుతోందని విమర్శించారు. విశాఖ ఉత్తరం, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావం సభల్లో లోకేష్ పాల్గొన్నారు.
ప్రశాంత విశాఖను వైకాపా ప్రభుత్వం విషాదనగరంగా మార్చేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వ అరాచకంతో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్న వైకాపా ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే గంజాయి అన్నదే లేకుండా చూస్తామని ఉత్తర నియోజకవర్గ సభలో హామీ ఇచ్చారు.
జగన్ విలాసాల కోసం రుషికొండపై 500 కోట్లతో భవనాలు నిర్మించారని లోకేష్ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ భవనాలను ప్రజల అవసరాలకు వాడతామని... గాజువాక సభలో వెల్లడించారు. అగనంపూడి వద్ద టోల్ గేట్ ఎత్తేస్తామని, గాజువాకలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా సీఎం చేసిన మంచి పనులను చెప్పుకొంటారని రాప్తాడు సభలో జగన్ మాత్రం చంద్రబాబు పేరును 108 సార్లు స్మరించారని గుర్తుచేశారు.
వైకాపా హయాంలో రోడ్ల మరమ్మతులే చేయలేదని అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ మండిపడ్డారు. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నల్లబెల్లం రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు గంజాయి సరఫరా చేస్తున్న వారెవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com