TDP: పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా..?

TDP: పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా..?
సీఐడీ సిబ్బంది దస్త్రాలు తగలబెట్టడంపై టీడీపీ మండిపాటు... ప్రభుత్వం మారడం ఖాయమనే ఇలాంటి చర్యలని విమర్శ

తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దస్త్రాలను...సీఐడీ సిబ్బంది తగలపెట్టడంపై దహనంపై తెలుగుదేశం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం మారడం ఖాయమని తెలియడంతోనే సిట్‌ అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారని.... నేతలు ఆరోపించారు. చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోక తప్పదని... హెచ్చరించారు. నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన సీఐడీ క్రైమ్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌గా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జగన్ పోలీస్ సర్వీస్‌గా రూపాంతరం చెందారని విమర్శించారు. చంద్రబాబు కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించడంతో.... చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పత్రాలను తగులబెడుతున్నారని ఆరోపించారు.


రఘురామిరెడ్డి తప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య ఆరోపించారు. పత్రాల దహనంపై రఘురామిరెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ఈ ఘటన చూశాక... సచివాలయంలోని దస్త్రాలన్నీ భద్రంగా ఉంటాయన్న నమ్మకం పోయిందని పట్టాభి ఆరోపించారు. ప్రభుత్వ మార్పు ఖాయమని గ్రహించే ఆధారాలు చెరిపేందుకు కుట్ర చేశారని తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆధారాలు మాయం, దస్త్రాల దహనంతో ఎవరూ తప్పించుకోలేరన్నారు. సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై విచారణ జరపాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. సీఐడీ చీఫ్ ఆదేశాలతోనే కీలక పత్రాలు తగలబెట్టినట్లు తెలుస్తోందన్న సీపీఐ నేత రామకృష్ణ... తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మాదిరిగా ఏపీలో సిట్ అక్రమ కేసు సాగిందన్నారు.


పత్రాలను తగలబెట్టిన వ్యవహారం బయటకు రాగానే తాడేపల్లి సిట్ కార్యాలయానికి పెద్దఎత్తున ఉన్నతాధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. ఆ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించలేదు. ఫోన్లలో ఎవరైనా చిత్రీకరించే యత్నం చేస్తే..వారి ఫోన్లు లాక్కుని వీడియోలు తొలగించి అక్కడి నుంచి పంపేశారు. అటు.. హెరిటేజ్ పత్రాల దహనంపై సీఐడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఫొటో కాపీల మిషన్ వేడెక్కిపోవటం వల్ల కొన్ని పేపర్లు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని, వాటిని కట్ చేసి దహనం చేశామని ప్రకటనలో పేర్కొంది. సీఐడి, సిట్ ఆధ్వర్యంలో ఐదు కేసులకు సంబంధించి విజయవాడ ACB కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశామని తెలిపింది. ఒక్కో అభియోగపత్రంలో 8 నుంచి 10 వేల పేజీలను కోర్టుకు సమర్పించామని పేర్కొంది. ఈ క్రమంలో..లక్షల పేజీల కాపీలు తీయాల్సి వచ్చిందని, ఫొటోకాపీ మిషన్ వేడెక్కడం వల్ల కొన్ని పేపర్లు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని వివరించింది. వాటిని కట్ చేసి దగ్ధం చేశామని తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామని, ఆదాయ పన్నుకు సంబంధించిన పేపర్లను అధికారికంగా తీసుకున్నామని పేర్కొంది. అయితే వ్యర్ధమైన పేపర్లు కాల్చినప్పుడు పత్రికల ప్రతినిధులకు ఎందుకు అనుమతించలేదో సమాధానం చెప్పలేదు.మీడియాలో విజువల్స్ వచ్చాక దహనం చేసిన ప్రాంతంలో ఒక్క పేపర్ కూడా లేకుండా సీఐడీ సిబ్బంది శుభ్రం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story