Sand Mafia: ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

Sand Mafia: ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు

ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇసుక అక్రమ దోపిడీకి నిరసనగా ఇవాళ ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తంగిరాల సౌమ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నాలుగు మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులను గృహ నిర్బంధం చేశారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పలువురు టీడీపీ నాయకులను తెల్లవారుజాము నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అక్రమ ఇసుక దోపిడీపై నిరసనగా ఇవాళ ఇబ్రహింపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ ప్రధాన కార్యాలయం ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముట్టడిలో పాల్గొనకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి శావల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, విస్సన్నపేట, ఏ. కొండూరు, గంపలగూడెం, తిరువూరు నాలుగు మండలాల టీడీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ఇసుక అరాచకాలపై గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. ఇవాళ రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ముట్డడికి పిలుపుతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచే పలువురు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇబ్రహింపట్నం పోలీసు స్టేషన్‌కు ప్రత్యేక బలగాలు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story