హైకోర్టు స్టేను స్వాగతించిన టీడీపీ నేతలు..!
అమరావతి భూములు వ్యవహారంలో హైకోర్టులో వైసీపీ సర్కారుకు షాక్ తగిందంటూ విమర్శించారు టీడీపీ నేతలు. కేవలం కక్షపూరితంగానే... చంద్రబాబుపై కేసులు పెట్టాలని చూశారన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ కోర్టు పక్షి అంటూ మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సంబంధం లేని అంశాల్లో తప్పుడు కేసులు పెట్టడం ఆర్కేకు ఆనవాయితి అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ ఆతృత సరైంది కాదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. జగన్ కు ఏమాత్రం నైతిక విలువలున్నా చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ కేసుతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, అదనపు ఏజీ ద్వారా ప్రత్యేకంగా వాదనలు వినిపించటమూ ప్రభుత్వ ఆతృతలో భాగమేన్నారు వర్ల రామయ్య.
హైకోర్టు స్టే ఇవ్వడం ఊహించిన పరిణామేనన్నారు టీడీపీ సీనియర్ నేత పట్టాభి. ఎలాంటి ఆధారాలు లేకుండా వైసీపీ నేతలు కేసులు పెడుతున్నారంటూ మరోసారి రుజువైందన్నారు. అసైన్డ్ భూములు గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు ఎక్కడుందని ప్రశ్నించారు. అసైన్డ్ భూములకూ పరిహారం ఇచ్చి దళితులకు చంద్రబాబు న్యాయం చేశామన్నారు. అందుకే రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారన్నారు.
హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర. అమరావతిపై వైసీపీ మొదటి నుంచి విషం కక్కుతూనే ఉందన్నారు. అమరావతిని అల్లరిపాలు చేయాలని జగన్ ప్రభుత్వం చూస్తోందన్నారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు అన్ని పారదర్శకంగా చేశారన్నారు. ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చామని రైతులు చెబుతుంటే.. ప్రభుత్వం కావాలనే నోటీసులు ఇచ్చిందన్నారు. హైకోర్టు స్టేతో... జగన్ సర్కారుకు దిక్కుతోచడం లేదంటూ ఎద్దేవా చేశారు టీడీపీ నేతలు. ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com