TDP: కొలికపూడిని పక్కనపెడుతున్న టీడీపీ?

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా కొలికపూడి ఆయనను కలవడానికి వచ్చారు. కానీ చంద్రబాబు ఆయనకు పలకరించకుండా, ఆయన షేక్ హ్యాండ్‌కు స్పందించకుండా ఉండటం రాజకీయం వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనంతరం జరిగిన సమావేశంలో కూడా కొలికపూడి పాల్గొనలేదు. దీనితో ఆయన్ను పక్కనపెట్టే దిశగా పార్టీ ముందుకెళ్తోందన్న సంకేతాలు వస్తున్నాయి. అమరావతి ఉద్యమ సమయంలో పార్టీ కోసం పని చేసిన కొలికపూడిని పార్టీ అధినాయకత్వం తిరువూరు అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన స్వగ్రామం కాకపోయినా స్థానిక అసంతృప్తిని అధిగమిస్తూ గెలిచేలా టీడీపీ అన్ని విధాలా మద్దతు ఇచ్చింది. కార్యకర్తల కృషితో విజయాన్ని సాధించిన కొలికపూడి ఇప్పుడు పార్టీ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధిష్టానానికే అల్టీమేటం
తాజాగా రమేష్ రెడ్డి అనే నేతపై చర్యలు తీసుకోకపోతే తన రాజీనామా ఉంటుందని ఆ పార్టీకి అల్టిమేటం ఇవ్వడం పార్టీ పట్ల ఆయన దూరతను స్పష్టం చేస్తోంది. పైగా, కొలికపూడి వైసీపీ నేతలతో కలిసి ఆర్థిక లావాదేవీల్లో పాల్గొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. కొత్త ఇంచార్జ్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.వ్యూహాలు లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లో పావులు కదుపుతున్న కొలికపూడి.. పార్టీకి తలనొప్పిగా మారారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేసిన ఆయనపై త్వరలో పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com