TDP: క్రమశిక్షణ కమిటీ ముందుకు టీడీపీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆ పార్టీ నాయకత్వం నోటీసులు జారీ చేసింది. సోమవారం పార్టీ క్రమ శిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈనెల 11న తన నియోజకవర్గంలోని ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో ఒక అంతర్గత రహదారి విషయంలో కొన్ని గిరిజన కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆ వివాదంలో జోక్యం చేసుకొని ఓ వ్యక్తిపై చేయి చేసుకొన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆ రోజే సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసి ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఆయన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో క్రమ శిక్షణ సంఘం ముందుకు పిలిపించాలని నిర్ణయించారు.
క్రమశిక్షణ కమిటీ ఇదే
ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ.షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణలతో కూడిన క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి హాజరుకానున్నారు. కొలికపూడిని ఇదివరకే చంద్రబాబు స్వయంగా పిలిచించి... పద్ధతి మార్చుకోవాలని సూచించారు. తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని సమన్వయ కమిటీ ముందుకు పిలిపించి వివరణ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి పిలిచారు.
ఎన్నో వివాదాలు
గడచిన ఏడు నెలల్లో ఎమ్మెల్యే పలు వివాదాలకు కేంద్రంగా మారారు. ఎ.కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణమంటూ ఒక ఇంటిని... ఎమ్మెల్యే దగ్గరుండి కూలగొట్టించేందుకు పూనుకోవడం విమర్శలకు దారితీసింది. చిట్యాలలో స్థానిక సర్పంచిని ఎమ్మెల్యే తూలనాడారని, వీఆర్‌ఏగా ఉన్న సర్పంచ్ భార్యతోను అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్ భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. కొలికపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వివాదాస్పద వ్యవహారశైలితో స్థానికంగా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైనా... అక్కడ అన్ని సామాజికవర్గాలవారూ సామరస్యంగా నడుచుకుంటారు. అంతా ప్రశాంతంగా ఉన్నచోట కొలికపూడి ఎమ్మెల్యే అయ్యాక... వర్గవైషమ్యాలు రెచ్చగొడుతున్నారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com