రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం!

రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం!
కొత్త ఏడాది గేర్ మార్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కోవిడ్ కారణంగా ఏడాది పాటు పార్టీ కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించిన అధినేత చంద్రబాబు. ఇప్పుడు దూకుడు పెంచారు.

కొత్త ఏడాది గేర్ మార్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కోవిడ్ కారణంగా ఏడాది పాటు పార్టీ కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించిన అధినేత చంద్రబాబు. ఇప్పుడు దూకుడు పెంచారు. ఇప్పటి వరకు ఇంటి నుండే పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించిన చంద్రబాబు.. ఇప్పుడు సైకిల్‌ స్పీడ్‌ పెంచారు. మరో వైపు లోకేష్ వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కమిటీలను యాక్టివ్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సోమవారం మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పొలిట్‌ బ్యూరో మీటింగ్ జరుగనుంది. కొత్త పొలిట్ బ్యూరో ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఆయా అంశాలపై లోతుగా చర్చించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికలు, అమరావతి ఉద్యమానికి జాతీయ పార్టీల మద్దతు, నియోజకవర్గాల ఇంచార్జిల నియామకం, ప్రభుత్వ వైఫల్యాలు-పార్టీ ప్రణాళికలపై చర్చించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో దానిపై వ్యూహ రచన సిద్ధం చేయనున్నారు.

మద్యాహ్నం నుంచి పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశం జరగనుంది. దీంట్లో రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు పార్టీ విధానాలపై చర్చించనున్నారు. మంగళవారం ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్ధుడు అయిన తరువాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నేతల ను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసే అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతలు పెద్దగా బయటకు రావడం లేదు. కరోనా కారణంగా పార్టీ అధిష్టానం కూడా చూసిచూడనట్లు వ్యవహరించింది. కొత్తేడాది గేర్ మారుస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ దిశగా నేతలకు గట్టిసూచనలు చేసే అవకాశముంది.

చంద్రబాబు రామతీర్ధం పర్యటన, లోకేష్ టూర్‌లు పార్టీలో కొత్త ఉత్సహం తెచ్చాయి. ఇదే ఊపు కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. కొత్తేడాది కొత్త ఉత్సహంతో పార్టీని పరుగులు పెట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story