Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళనలు..

Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా   కొనసాగుతున్న ఆందోళనలు..
దీక్షలు, ప్రార్థనలు, నిరసనల హోరు..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పట్ల జిల్లాలో రోజురోజుకూ ఆ పార్టీ నిరసనల హోరు పెరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టాయి. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అందం అబద్దయ్య దీక్షలను ప్రారంభించారు. దీక్షలో సగర సామాజిక వర్గానికి చెందిన నేతలు పాల్గొని బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మర్చిపోయిన సీఎం జగన్ ప్రతిపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


అటు అనంతపురం జిల్లా నార్పల మండలం తెదేపా కార్యాయలం వద్ద రాష్ట్ర కార్యదర్శి నరసనాయుడు ఆధ్వర్యంలో...నిరనసలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు దీక్షలో నల్ల రిబ్బన్లు కట్టుకొని మోకాళ్లపై కూర్చుని మట్టి కుండలతో సైకో పోవాలి సైకిల్ రావాలి అని నిరసన వ్యక్తం చేశారు. దీక్షకు సి.పి.ఐ నాయకులు మద్దతు పలికారు. మేముసైతం బాబు కోసం అంటూ YSR జిల్లా మైదుకూరులో మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పార్టీ నాయకులు అన్నారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు ఓ దీక్షగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లు వెలిగించి నిరసన తెలియజేశారు. రాయవరం మండలం వెదురుపాకలో మహాశక్తి కార్యక్రమంలో MLA వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు... వీధుల్లో దీపాలు ఆపేసి... కొవ్వొత్తుల వెలుగులతో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం నాయకుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శనతో భారీ ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడిలో కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు..

Tags

Read MoreRead Less
Next Story