Chandrababu: క్వాష్ పిటిషన్ కొట్టివేతపై సుప్రీంకోర్టుకు టీడీపీ..!

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ... ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి క్వాష్ పిటిషన్ కాపీని అందించారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఐతే.. ఇవాళ, రేపు సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబును అరెస్టును సమర్థిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు.. ఆయనకు రిమాండ్ విధించింది. దీన్ని ఖండిస్తూ.. ఆయన తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఐతే.. ఈ కేసులో దర్యాప్తు ఇప్పటికే చాలా దూరం వెళ్లిపోయిందన్న హైకోర్టు.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేము అంటూ... క్వాష్ పిటిషన్‌ని కొట్టి వేసింది. దాంతో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
ఆదివారం చంద్రబాబు రిమాండ్ అదనపు గడువు ముగుస్తుంది. అందువల్ల సోమవారం ఆయన్ని సీఐడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెడతారు. అలా జడ్జి ఆయనతో మాడ్లాడతారు. రిమాండ్ పొడిగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు సోమవారం విచారించనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్డు స్కాం కేసు, ఫైబర్ నెట్ స్కాం కేసుల్లో CID దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా సోమవారమే విచారణ జరగనుంది. ఇలా సోమవారం చాలా పిటిషన్లపై విచారణలు ఉన్నాయి.మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com