TDP: జగన్ నాటకాలకు యువత బలి, జాబ్ క్యాలెండర్ పై ప్రశ్నించిన లోకేశ్...

ఆంధ్రప్రదేశ్‌లో ఏటా జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటూ సీఎం జగన్ యువతను మోసగించారని తెలుగు యువత ఆందోళనలు నిర్వహించింది. గుంటూరు కలెక్టరేట్ ఎదుట రిక్షాలు తొక్కుతూ నాయకులు నిరసన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నోటిఫికేషన్ పేరుతో మరో నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. విజయనగరం కోట కూడలిలో ఉద్యోగాల భర్తీ కోరుతూ తెలుగు యువత నాయకులు ఆందోళన చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇవ్వక పోగా ఉన్న పరిశ్రమలనూ తరిమేసి ఉపాధికి గండికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ప్రధాన రహదారిపై బిక్షాటన చేస్తూ యువకులు నిరసన తెలిపారు.
తెలుగు యువత ఆందోళన నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ నాటకాలకు యువత బలవుతోందని లోకేష్ సామాజిక మాధ్యమాల్లో ఆరోపించారు. ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ మాయమాటలు నమ్మి యువత మోసపోయిందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదని ఆక్షేపించారు. ఏటా 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినా...ఒక్క ఉద్యోగాన్నీ ఇవ్వలేదన్నారు. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్న ఆయన...ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దన్నారు. 6 నెలలు ఓపిక పడితే తెదేపా ప్రభుత్వం వస్తుందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ అసమర్థపాలనకు ఇంకెంతమంది బలికావాలని లోకేశ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి వేలకోట్ల ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ కొత్త బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండులో బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లి ముగ్గురు అమాయకులు బలైన దుర్ఘటన మరువకముందే.. తాజాగా భీమవరం సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాజా శ్రీనివాసరావు అనే ధాన్యం వ్యాపారిని ఢీ కొనడంతో మృతి చెందాడన్నారు. ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగా చెప్పినా స్పేర్ పార్టులకు డబ్బుల్లేవని మరమ్మతులతో సరిపెట్టిన దివాలాకోరు ప్రభుత్వమని దుయ్యబట్టారు. మెయింటినెన్స్ లోపం కారణంగా ప్రమాదం సంభవించినట్లు స్పష్టమవుతున్నందున ఇది ఖచ్చితంగా సర్కారీ హత్యేనన్నారు. మృతుడి కుటుంబానికి సరైన పరిహారం అందజేసి, ఇకనైనా దున్నపోతు ప్రభుత్వం కళ్లుతెరచి ఆర్టీసీ గ్యారేజిల్లో మెయింటినెన్స్‌కు నిధులు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నానని నారా లోకేష్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com