Andhra Pradesh: ఉపాధ్యాయుల అరెస్టులతో అట్టుడికిన ఏపీ.. సీపీఎస్ రద్దు కోసమే పోరాటం..

Andhra Pradesh: ఏపీలో ఉపాధ్యాయులు మరోసారి రోడ్డెక్కుతున్నారు. CPS రద్దుపై ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఛలో CMOకి పిలుపు ఇవ్వడంతో దీన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు విజయవాడ చేరుకోకుండా ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలోని నాలుగు మండలాల్లో యూటీఎఫ్ నాయకులను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ప్రభుత్వం పోరుగర్జనకు అనుమతిలేదని.. ఒకవేళ వెళ్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసుల తీరుపై యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. తిరుపతిలోనూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నేతల గృహనిర్బంధం చేశారు.
ఛలో విజయవాడకు యూటీఎఫ్ నేతలు పిలుపునివ్వడంతో.. తిరుపతిలోని టీచర్లపై పోలీసు అధికారులు నిర్బంధం విధించారు. దీంతో పోలీసులు తీరుపై యూటిఎఫ్ నేతలు మండిపడతున్నారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ తాము డిమాండ్ చేస్తుంటే.. ఆంక్షలతో అడుగడుగునా అడ్డుకోవాలని చూడడం ఏంటని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మండిపడ్డారు.
తాము CMOకు వస్తుంటే శాంతిభద్రతల సమస్య అనడం దారుణమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా CPS రద్దు చేసే వరకూ పోరాటం ఆగబోదన్నారు షేక్ సాబ్జీ. ఇటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానూ ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండ్‌తో సీఎంవో ఆఫీసు ముట్టడికి పిలుపునివ్వడంతో.. ముందస్తుగా అందర్నీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు.
దీంతో పోలీసుల తీరుపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చమంటే.. నిర్బంధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలోనూ అదే పరిస్థితి. ఉపాధ్యాయ నేతలకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ తరహాలో ఉపాధ్యాయులపై ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసుల చర్యలపై టీచర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
UTF తలపెట్టిన 'ఛలో సీఎంవో'కి అనుమతి లేదని విజయవాడ CP కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని, శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నేతలు సహకరించాలని కోరారు. అయితే ఛలో సీఎంవోను విజయవంతం చేసి తీరతామంటున్నారు ఉపాధ్యాయ సంఘం నేతలు. సీపీఎస్ రద్దు చేసేవరకు తమ పోరు ఆగదంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com