AP: ప్రభుత్వ బడుల్లో కోడింగ్ పాఠాలు

AP: ప్రభుత్వ బడుల్లో కోడింగ్ పాఠాలు
X
పైలట్ ప్రాజెక్టుగా 7 వేల మంది విద్యార్థులకు కోడింగ్ పాఠాలు

సాధారణంగా కోడింగ్‌పై పట్టు ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకే సాఫ్ట్‌వేర్‌ కొలువులు దక్కుతుంటాయి. ఇలాంటి నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్‌ నైపుణ్యాలను నేర్పిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతోంది. అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజినీర్‌ పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణనిస్తోంది. ఈ మేరకు గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సమగ్రశిక్ష, లీడర్‌షిప్‌ ఫర్‌ ఈక్విటీ, క్వస్ట్‌ అలయన్స్‌ అనే స్వచ్ఛంద సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.

పైలట్ ప్రాజెక్టుగా...

పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ మొదలుపెట్టింది. 248 మందికిపైగా ఉపాధ్యాయులు, 7,381 మంది విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో నేర్పించింది. తొలి ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ప్రతిభావంతులను గుర్తించి వారి నైపుణ్యాలను మదించేలా విశాఖలో హ్యాకథాన్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సర్కారీ బడుల పిల్లలకు స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాటుచేశారు. విజేతలకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు, టీవీలను బహుమతులుగా ఇచ్చి ప్రోత్సహించారు. కంప్యూటర్, కోడింగ్‌ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చిన ఉపాధ్యాయులకు ఆరు నెలలపాటు ఫిర్కీ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం వేదికగా కంప్యూటర్‌ స్కిల్స్‌ నేర్పించారు.‘50 వేల మంది విద్యార్థులకు ఏఐ, కోడింగ్‌ నైపుణ్యాలను నేర్పించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని ఏఈఎఫ్‌ రాష్ట్ర సమన్వయకర్త మాధవీలత చెప్పారు.


Tags

Next Story