Davos world economic forum : జ్యూరిచ్‌లో ఇద్దరు సీఎంల ఆత్మీయ కలయిక

జ్యూరిచ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ప్రవాహం తదితర అంశాలపై పరస్పరం అభిప్రాయాలనుపంచుకున్నారు.
జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ నుండి హిల్టన్ హోటల్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ భారతీయ అంబాసిడర్ మృదుల్ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. తర్వాత పలువురు పారిశ్రామిక వేత్తలతో కొద్దిసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పారిశ్రామిక వాసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విభిన్న రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చంద్రబాబు బృందం వెల్లడించింది.

అనంతరం అక్కడున్న ప్రవాసాంధ్రులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేశానికి వెలుపల ఉన్నా తమ మాతృభూమి పురోగతికి సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్లు తెలిసింది.

అంతటితో ముగించుకోకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో డావోస్‌కు బయలుదేరిన సీఎం చంద్రబాబు బృందం, అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాలుపంచుకోనుంది. ఈ పర్యటనలో రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చటమే లక్ష్యంగా వ్యవహరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com