PAWAN: పవన్ కల్యాణ్‌కు కోర్టు సమన్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సివిల్ కోర్టులో రామారావు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు పవన్‌కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది.
ఎందుకంటే..
కలియుగ దైవం వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగిందని.. అందులో నిషేదిత జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది రామారావు పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు.. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు 2024, నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
రుషికొండ భవనాలను పరిశీలించిన పవన్
విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్‌తో కలిసి భవన సముదాయాల్లో కలియతిరిగారు. అధికారులను అడిగి ఆ భవనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కాగా, అంతకముందు విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా పరిస్థితులను పవన్ సమీక్షించిన విషయం తెలిసిందే.
డయేరియా మృతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. సోమవారం గుర్ల ప్రాథమిక ఆర్యోగ కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. అతిసార వ్యాప్తి కారణాలపై కలెక్టర్‌తో సమీక్షించారు. గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని పవన్ చెప్పారు.
పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షణీయం: పవన్
ఏపీ ప్రభుత్వం మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, 'పింగళి వెంకయ్య మెడికల్ కాలేజీ'గా పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పలు విద్యాసంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టుకుంటే.. తాము మాత్రం దేశ నాయకుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com