CBN: చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఫోన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. శాసనసభకు ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను, ఓటింగ్ వివరాలను గవర్నర్ కు మీనా సమర్పించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గెలుపొందిన అభ్యర్ధుల జాబితాతో కూడిన నివేదికను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో..... లోక్ సభకు ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను లోక్ సభ సచివాలయానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
బాబు దిశానిర్థేశం
సేవ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండబోదన్న ఆయన రాజకీయ పరిపాలన మాత్రమే చేస్తానని చెప్పారు. కష్టపడి పనిచేసిన సామాన్య కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తులో భాగంగా... నేడు NDAపక్షాల సమావేశంలో పాల్గోనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఎంపీలు పాల్గొనగా...మిగతా వారు జూమ్ ద్వారా హాజరయ్యారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో అనుసరించాల్సిన కార్యాచరణ సహా ఐదేళ్లు పనిచేయాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలను గౌరవించేలా పనిచేయాలని సూచించిన చంద్రబాబు 5 ఏళ్ల పాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని పార్టీని కార్యకర్తలే నిలబెట్టారని అన్నారు.
ఎంపీలుగా మంచి పనితీరు కనబర్చి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారన్న ఆయన బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని ఇకపై అలా ఉండదని తేల్చిచెప్పారు. ఎంపీలంతా తరచూ వచ్చి కలవాలన్న చంద్రబాబు తాను బిజీగా ఉన్నా మీతో మాట్లాడుతానని హామీఇచ్చారు. తన కోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారని, అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదని గుర్తుచేసుకున్నారు. ఇకపై ప్రతి అంశాన్నీ స్వయంగా పరిశీలిస్తానన్న చంద్రబాబు రాజకీయ పరిపాలన ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టపడి విధేయతతో పనిచేస్తే పదవులు వస్తాయన్న ఆయన దానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడే నిదర్శనమని చెప్పారు. అప్పల నాయుడుకి టికెట్ ఇస్తే చాలామంది వ్యాఖ్యలు చేశారని,ఆయన మాత్రం అందరినీ కలుపుకునిపోయి గెలిచారని కితాబిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com