HC: వై.ఎస్‌. అవినాష్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

HC: వై.ఎస్‌. అవినాష్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
బెయిల్‌ రద్దు చేయాలంటూ దస్తగిరి పిటిషన్‌... నోటీసులు ఇచ్చిన హైకోర్టు

మాజీమంత్రి వై.ఎస్ . వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుచేయాలని దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రస్తుతం బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి..వివేకా హత్యకేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, సాక్ష్యులను బెదిరిస్తున్నారని పిటిషనర్ దస్తగిరి కోర్టుకు.. తెలిపారు. ఈ పిటిషన్ పై సీబీఐ సహా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తె సునీతలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.


మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును అవినాష్ రెడ్డి ఉల్లంఘిచారని పిటిషన్ లో పేర్కొన్నారు. సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే 20కోట్ల రూపాయలతో పాటు... కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని ప్రలోభ పెట్టారని ఆరోపించారు. కడప జిల్లా పులివెందుల మండలం నామాలగుండు గ్రామంలో తన తండ్రిపై ఈనెల 8న రాత్రి అవినాష్ రెడ్డి అనుచరులు ముగ్గురు హత్యాయత్నం చేశారని తెలిపారు. సాక్షిగా సీబీఐ రక్షణ తనకు మాత్రమే ఉంటుందని, కుటుంబానికి కాదని పేర్కొన్నారు. తన తండ్రిపై హత్యాయత్నం ద్వారా తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇతర కేసుల్లో తాను కడప కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి.... జైలు సూపరింటెండెంట్ ను ప్రభావితం చేసి నవంబరు 28న మెడికల్ క్యాంపయిన్ పేరుతో జైల్లోకి వచ్చారని దస్తగిరి తెలిపారు. 20 కోట్లతో నేరుగా ఎస్ఎస్ఆర్ వద్దకు వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనను కలిశారని దస్తగిరి పిటిషన్ లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి, సీఎం జగన్ , వైఎస్ భారతి రెడ్డిలు తమ పక్కన ఉన్నారని.. వారి కోసం తాము ఎవర్నయినా, ఏం చేయడానికైనా సిద్ధమని చైతన్యరెడ్డి హెచ్చరించినట్లు వెల్లడించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే తమ కుటుంబాన్ని, పిల్లలను అవినాష్ రెడ్డి, సీఎం జగన్ చూసుకుంటారని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని చెప్పారు.


మరోవైపు వైసీపీ పునాదులు వివేకానందరెడ్డి, కోడికత్తి శ్రీను రక్తంలో ఉన్నాయని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. అన్నా అని పిలిపించుకున్న వ్యక్తే తన తండ్రిహంతకులకు కొమ్ముకాస్తున్నారని...వివేకా సంస్మరణ సభలో జగన్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జగన్ ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదన్న షర్మిల ఆయన తన మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని హితవుపలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయవద్దన్న జగన్ చెల్లెళ్లు.... హంతకులు, వారికి అండగా నిలిచేవాళ్లకు గుణపాఠంచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story