MEET: ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు కరువు సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా ఉద్యమం చేయనున్నట్లు తెలుగుదేశం-జనసేన పార్టీలు స్పష్టం చేశాయి. ఇకపై ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించాలని ఇరుపార్టీల సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు. వచ్చే శుక్ర, శనివారాల్లో ఏపీలోని రోడ్ల దుస్థితిపై ఉమ్మడిపోరాటం చేయాలని తీర్మానించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను ఇంటింటికీ చేరేలా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం- జనసేన పార్టీల సమన్వయ కమిటీ రెండో సమావేశం విజయవాడలో మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. నియోజకవర్గ స్థాయిలో ఇరుపార్టీల సమన్వయం కోసం ఈనెల 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై 2 పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామని... త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.
ఈ సమన్వయ కమిటీ భేటీకీ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య... జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, మహేందర్‌రెడ్డి, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్విని పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు వీరు సుదీర్ఘంగా సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
ఈ నెల 13న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ అవుతుందన్నారు. కరవు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు పేర్కొన్నారు. యువత, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఉమ్మడి పోరాట ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. సైకో పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇకపై ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినా రెండు పార్టీలు కలిసే వెళ్తాయని అచ్చెన్న తెలిపారు. లోకేష్ పాదయాత్రతో పాటు ఇరుపార్టీల ఉమ్మడి సభలపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నందునే తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని... ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీలో తెలుగుదేశం, జనసేన కలిసే బరిలోకి దిగుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని జగన్‌ను వదలించడమే తమ మొదటి లక్ష్యమని ఇరు పార్టీలు స్పష్టం చేశాయి. జనసేన ఇచ్చిన ఐదారు అంశాలను చేర్చి తెదేపా - జనసేన ఉమ్మడిగా భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచారం నిర్వహిస్తాయని ప్రకటించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com