TATA: గొప్ప మానవతా వాదిని కోల్పోయాం

దేశ పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా ఇకలేరన్న వార్త తెలిసి దిగ్భ్రాంతి చెందినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రతన్ టాటా మృతి పట్ల ఆయన ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. దార్శనికత, చిత్తశుద్ధితో ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం ఒక వ్యాపార టైటాన్ నే కాదు.. అసలు సిసలైన గొప్ప మానవతావాదిని కోల్పోయామన్నారు. పరిశ్రమ, దాతృత్వం, తర్వాతి తరాలకు స్ఫూర్తినిచ్చే ఆయన వ్యక్తిత్వం, దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సేవల్ని గుర్తుచేసుకున్నట్లు చెప్పారు. అలాంటి వ్యక్తి లేకపోవడం.. పారిశ్రామిక రంగానికే కాదు.. దేశానికే తీరని లోటన్నారు. రతన్ టాటా మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న టాటా గ్రూప్ కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రేవంత్ సంతాపం
పరిశ్రమల అభివృద్ధి, సమాజ సేవలో ఆయన భాగస్వామ్యం తరాలకు స్ఫూర్తినిచ్చిన రతన్ టాటా మరణం దేశానాకి తీరని లోటని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టాటా మరణంతో ఇండస్ట్రీ ఐకాన్‌ను కోల్పోయిందని, ఆయన లాంటి వ్యక్తి ఎవరూ రారని ‘X’లో చెప్పారు.
టాటా మృతి పట్ల కేసీఆర్ సంతాపం
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. 'ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా నిలిచారు. సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన జీవిత కాలం ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలి.' అంటూ కేసీఆర్ ఆకాంక్షించారు.
టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. భారతీయులకు ఇది బాధాకరమైన రోజని.. సేవలో రతన్ టాటాను మించినవారు లేరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. టాటా మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని రాజమౌళి.. టాటాది బంగారంలాంటి హృదయమని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. లక్షలాది మందికి ఆశాజ్యోతి టాటా అని ప్రముఖ నటి ఖుష్బూ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com