ఉధృతంగా విశాఖ ఉక్కు ఉద్యమం..!

ఉధృతంగా విశాఖ ఉక్కు ఉద్యమం..!
మరోవైపు విశాఖ ఉక్కు కోసం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు.

విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి మార్మోగుంది. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలతో కార్మికులు తమ నిరసనను.. కేంద్రానికి తెలియజేస్తున్నారు. అటు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వారి పట్ల ఉద్యమకారులు కృతజ్ఞతను చాటుకుంటున్నారు. పోరాటానికి సంఘీభావం ప్రకటించిన మెగాస్టార్‌ చిరంజీవి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ పోరాటాన్ని అర్థం చేసుకుని అందరూ భాగస్వాములు కావాలని విజప్తి చేశారు.

మరోవైపు విశాఖ ఉక్కు కోసం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని.. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. తన రాజీనామాపై వస్తున్న విమర్శలు బాధాకరమని, స్పీకర్‌ స్వయంగా ఫోన్‌ చేసినప్పుడు కూడా తన రాజీనామాను ఆమోదించమనే చెప్పానన్నారు గంటా శ్రీనివాసరావు.

అటు విశాఖ ఉక్కు ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే... కడపలో స్టీల్ ప్లాంట్ అంటూ సీఎం జగన్ రెడ్డి కొత్తరాగం మొదలెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని నిజంగా జగన్‌కు ఉంటే.. దివాలా తీసిన కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకోరని అన్నారు. భారతి సిమెంట్స్‌పై చూపిన శ్రద్ధ, కడప స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు చూపరని బీటెక్ రవి ప్రశ్నించారు.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సుధీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవెర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. అటు ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో వినిపించాలని నిర్ణయించాయి.

ఈ నెల 15 నుంచి రోజుకో రూపంలో నిరసన తెలియజేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నిర్ణయించింది. అవసరమైతే అన్ని వర్గాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాజకీయ, సిని ప్రముఖుల మద్దతు తీసుకుని విశాఖ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Tags

Next Story