MLA Kalava Srinivasulu : రైతులకు అడుగడుగునా ప్రభుత్వం అండగా ఉంటుంది

ప్రజల ఆశీర్వాదం, దీవెనలతో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తపరిచారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నదాతకు అడుగడుగునా అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి 20వేల ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం మొదటి విడతగా రూ. ఏడు వేలు రైతుల ఖాతాలకు ఇటీవల జమ చేసిన విషయం విధితమే. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండల కేంద్రంలో రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞత పూర్వకంగా మంగళవారం పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అధికారంలోకి రాగానే పింఛన్ రూ.4 వేలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.13 వేలు, అన్నదాత సుఖీభవ ద్వారా అర్హులైన రైతులందరికీ రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. తాజాగా ఆగస్టు 15 నుంచి మహిళలకు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని అమలు చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేదరికంలేని సమాజాన్ని చూడాలన్న సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని, రైతులకు పెట్టుబడి రాయితీ ద్వారా సాయం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అమోఘమన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ.3174 కోట్లు రైతులకు ఆర్థిక చేయూత అందించామన్నారు. అందులో రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని 42,533 మంది రైతులకు రూ.29.77 కోట్లు సాయం అందిందన్నారు. కనేకల్లు మండలంలో ఎక్కువమంది రైతులు వ్యవసాయంపై ఆధారపడ్డారన్నారు. ఈ మండలంలోనే 9767 మంది రైతులకు రూ.6.84 కోట్లు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులందరికీ సమన్యాయం చేసిందని కాలవ పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com