అరకు లోయ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే!

అరకు లోయ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే!
అరకు అందాలను, ఆ అనుభవాలను మోసుకెళ్లాల్సి వాళ్లు.. తమతో వచ్చిన వారి మృతదేహాలను మోసుకెళ్లాల్సిన పరిస్థితి. క్షణకాలంలో జరిగిన ఘోర ప్రమాదంతో ఆప్తులను కోల్పోయారు.

అరకు అందాలను, ఆ అనుభవాలను మోసుకెళ్లాల్సి వాళ్లు.. తమతో వచ్చిన వారి మృతదేహాలను మోసుకెళ్లాల్సిన పరిస్థితి. క్షణకాలంలో జరిగిన ఘోర ప్రమాదంతో ఆప్తులను కోల్పోయారు. ఒక్కొక్కరి ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. కూతుర్ని చూపిస్తేనే గాయాలకు మందు వేయించుకుంటానంటూ ఓ తల్లి రోదన. మా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి.. ఒక్కసారి చూపించండయ్యా అంటూ ఆ తల్లులు ఏడుస్తుంటే మిగిలిన వాళ్లంతా కంట తడి పెట్టుకున్నారు.

హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందిన ఆర్‌బీఐ ఉద్యోగి వారి దగ్గరి బంధువులు మొత్తం 26 మంది టూర్‌కు బయల్దేరారు. విజయవాడ, అమరావతి, మంగళగిరి సందర్శించి అన్నవరం దేవస్థానానికి వెళ్లారు. అక్కడినుంచి సింహాచలం వెళ్లి మన్యంలోని లంబసింగి, పాడేరు, అరకు, బొర్రా గుహలను సందర్శించారు. ఏజెన్సీ అందాలను తిలకించిన తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి ఏడున్నర ప్రాంతంలో వీరి బస్సు ఘాట్‌ రోడ్డులో అనంతగిరి మండలం డముకు సమీపంలోకి చేరుకుంది. అక్కడే అతి ప్రమాదకరమైన ఐదో నంబర్ మలుపు వద్ద అదుపుతప్పి కన్నుమూసి తెరిచేలోగా 100 అడుగుల లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది.

అరకులోయ ఘాట్‌రోడ్‌లో మొత్తం 8 ప్రమాదకర హెయిర్‌ పిన్‌ బెండ్‌లు ఉంటాయి. ఈ ప్రమాదకర మలుపుల దగ్గర వాహనాలు వెళ్లడం అంత సులువు కాదు. భారీ వాహనాలు ఈ మలుపుల్లో వంకర్లు తిరిగేందుకు అవస్థలు పడాలి. ఏ మాత్రం అనుభవం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ప్రమాదానికి గురైన టూరిస్ట్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ట్రావెల్స్ యజమానులతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. దినేష్ ట్రావెల్స్ కు చెందిన ఈ మిని బస్సు అస్సలు కండిషన్ లో లేనట్టు అధికారులు చెబుతున్నారు.

దానికి తోడు ఘాట్ రోడ్డులో నడిపే అనుభవం లేకపోయినా డ్రైవర్ ను అరుకు పంపించారు ట్రావెల్ యజమానులు. అసలు ఎంతో అనుభవం ఉన్నా ఘాట్ రోడ్డులో బస్సు నడపడం చాలా కష్టం అలాంటింది అనుభవం లేని డ్రైవర్ ను ఎలా పంపించారన్నది సమాధానం లేని ప్రశ్న. దానికి తోడు బ్రేక్ లు ఫెయిలవ్వడంతో బస్సు అదుపుతప్పింది. ఇలా అడుగడుగునా ప్రమాదంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన మలుపు హెయిర్ పిన్ మాదిరి ఒంపుగా ఉండటంతో ఎదుట ఏముందనేది డ్రైవర్ గుర్తించనట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story