Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ కస్టడీలో పోలీసులు తేల్చింది ఇదే

గన్నవరం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న వంశీని కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈనెల 25వ తేదీన తొలి రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఏరోజుకారోజు సాయంత్రం తిరిగి జైలుకు అప్పగించారు.
మూడో రోజు గురువారం కస్టడీకి తీసుకున్న పోలీసులు సాయంత్రం వరకు విచారించి గడువు ముగియడంతో తిరిగి కోర్టులో హాజరు పరిచారు. ఉదయం జైలు నుంచి వంశీతోపాటు సహ నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిలను తమ ఆధీనంలోకి తీసుకుని నేరుగా ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆతర్వాత అక్కడి నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్ కు తరలించారు. మూడో రోజు కూడా వంశీ, తది తరులను వేర్వేరుగా విచారించిన ముగ్గురు ఏసీపీ స్థాయి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మూడు రోజులపాటు పోలీసులు వంశీపై దాదాపు 75 ప్రశ్నలు సంధించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉన్నవారి గురించి ఆరా తీశారు. వంశీ చెబితేనే సత్యవర్ధనన్ను తీసుకెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు సమాచారం. మూడో రోజు దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు అరెస్ట్ సమయంలో వంశీ తన సెల్ ఫోన్ ను ఎక్కడ దాచారని అడిగినట్లు తెలుస్తోంది. తనకు ఏమీ తెలియదని, గుర్తు లేదని వంశీ పదే పదే చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. వంశీ తాడేపల్లి వెళ్ళి జగన్ ను కలిసిన అంశంపై పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం. అదేవిధంగా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి విశాఖకు తరలించే విషయమై ప్రశ్నించగా తెలీదని సమాధానం చెప్పడంతో ఆయన అనుచరులు తీసుకెళ్ళే వీడియో క్లిప్పింగ్, గూగుల్ మ్యాప్, సాంకేతిక ఆధారాలను ముందుంచి ప్రశ్నించగా మిన్నకుండిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
సత్యవర్ధన్ ను బెదిరించి కేసు తారుమారు చేయాలని చూశారని వంశీ, అతని అనుచరులు సత్య వర్ధన్ను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నా యని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు సేకరించామని, కోర్టు ఆదేశాలతో వంశీని మూడు రోజులు ప్రశ్నించామన్నారు. కొన్నింటికి అవునని, మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. అదృశ్యమైన ఆయన ఫోన్ గురించి అడిగితే తెలియదని చెప్పారని, ఈనెల 12న హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ ను కలిసినట్టు వంశీ అంగీకరించా రన్నారు. అయితే తమకు ఇంకా పూర్తి సమాచారం రావాల్సిఉన్నందున మరోసారి వంశీతో పాటు ఇతర నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ వేస్తామని ఏసీపీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com