Vijayawada : బుడమేరుకు మూడు గండ్లు.. బెజవాడ ముంపుకు ఇదే కారణం
బుడమేరుకు మూడు చోట్ల భారీ గండ్లు పడడం వల్లే విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ, ఖమ్మం జిల్లాలు నిండా మునిగాయి. ఆ వరద నీరంతా బుడమేరుపై పడింది. దీంతో సామర్థ్యానికి మించి ఒక్కసారిగా వరద పెరగడంతో విజయవాడ నగరానికి సమీపంలోని మూడు ప్రాంతాల్లో బుడమేరుకు గండ్లు పడ్డాయి. దీంతో ఆదివారం తెల్లవారుజాముకే బెజవాడలోని సింగ్ నగర్, రాజేంద్రనగర్ తదితర లోతట్టు ప్రాంతాలు క్రమేనా ముంపునకు గురవుతూ వచ్చాయి. అయితే సోమవారం ఉదయం వరకు కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో విజయవాడ లోని ౪౦ శాతం పైగా నివాసాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
బుడమేరు మేజర్ డ్రైన్ వరద సామర్ధ్యం 8 నుంచి 10 వేల క్యూసెక్కుల లోపు మాత్రమే అయితే ఇటీవల ఆధునీకరణ పనులు చేపట్టిన నేపధ్యంలో 17 వేల క్యూసెక్కుల వరకు సామర్థ్యాన్ని పెంచారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని వెలగలేరు వద్ద బుడమేరు డ్రైన్ కు జలవనరుల శాఖ అధికారులు డైవర్షన్ కాలువను నిర్మించారు. సమీపంలో 11 గేట్లతో రెగ్యులేటర్ ను కూడా ఏర్పాటు చేశారు. బుడమేరుకు వరదొచ్చిన ప్రతి సారి గేట్లను ఎత్తివేసి కృష్ణానదికి వరదను వదిలేవారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com