AP Wines: ఏపీలో మద్యం షాపుల టైమింగ్స్‌లో మార్పులు..

AP Wines: ఏపీలో మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు బార్లా తెరవనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి. నైట్ కర్ఫ్యూతో పాటు సినిమా హాళ్లు, ఇతరత్రా వ్యాపారాలపై అనేక ఆంక్షలు విధిస్తున్న తరుణంలో.. మద్యం షాపుల పనివేళలు మాత్రం పెంచడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ ప్రారంభం అవుతుండగా 10 గంటల వరకూ మద్యం షాపులను మందుబాబులకు అందుబాటులోకి తెచ్చింది. ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలోనే అకౌంట్ల నిర్వహణ కోసం రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంచుతున్నట్లు తెలిపింది. అయితే అకౌంట్ల నిర్వహణకు షట్టర్లు తెరిచి ఉంచడమెందుకో స్పష్టత లేదు.
రాష్ట్రంలో మద్యం షాపుల పనివేళలపై ఎవరికీ స్పష్టత లేదు. గత ప్రభుత్వంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరిగేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీ మద్య నిషేధ చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాల పనివేళలు కుదించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలుంటాయని నిర్ణయం తీసుకుంది.
తమ ప్రభుత్వం ఒకేసారి 3 గంటలు తగ్గించిందని గొప్పలు చెప్పుకుంది. ఆ తర్వాత కొద్దికాలానికే అకౌంట్ల నిర్వహణ కోసం అంటూ మద్యం షాపులు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి అకౌంట్ల నిర్వహణ పేరుతో మరో గంట సమయం పెంచి 10 వరకు షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com